Breastfeeding Week Rayaparthy
* ముఖ్య అతిధిగా పాల్గొన్న సర్పంచ్ గారే సాహేంద్ర భిక్షపతి
ఆకేరు న్యూస్,రాయపర్తి:
రాయపర్తి మండల కేంద్రంలోని స్థానిక అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన “తల్లిపాల వారోత్సవాలు” కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాయపర్తి గ్రామ సర్పంచ్ గారే సాహేంద్ర భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ పరిధిలోని గర్భిణులు, బాలింతలతో నేరుగా ముచ్చటించి, శిశువుల శారీరక, మానసిక వికాసంలో తల్లిపాల విశిష్టతను వివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
శిశువుకు తొలి అమృతం – జున్నుపాలు: బిడ్డ జన్మించిన వెంటనే (గంటలోపు) ఇచ్చే తొలి జున్నుపాలు (కోలోస్ట్రమ్) శిశువుకు మొదటి టీకా లాంటిదని సర్పంచ్ తెలిపారు. ఇవి బిడ్డలో రోగనిరోధక శక్తిని విశేషంగా పెంచుతాయి.
* ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలే
పుట్టిన ఆరు నెలల వరకు పసిపాపకు తల్లిపాలు తప్ప మరే ఇతర ఆహారం కానీ, మంచి నీరు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదని, తల్లి పాలల్లోనే సమస్త పోషకాలతో పాటు అవసరమైన నీటి శాతం కూడా ఉంటుందని స్పష్టం చేశారు.
తల్లికి, బిడ్డకు రక్షణ: తల్లిపాలు తాగడం వల్ల పిల్లలలో శారీరక, మానసిక పెరుగుదల చక్కగా ఉంటుంది. అదే సమయంలో పాలు ఇచ్చే తల్లులలో రొమ్ము, అండాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని వివరించారు.
* పౌష్టికాహారం తీసుకోవాలి
గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సర్పంచ్ కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించి, ప్రతి ఒక్కరూ తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ శశికళ, కృష్ణవేణి, విజయ రాణి, కవిత, స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా సిబ్బంది, ఏఎన్ఎంలు, గ్రామ మహిళలు, గర్భిణులు మరియు బాలింతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
