Anit Padda Brahmastra 2
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
అయాన్ ముఖర్జీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ ఫ్రాంచైజీలోకి అనీత్ పడ్డా చేరబోతున్నట్లు సమాచారం. ‘బ్రహ్మాస్త్ర 2’లో కీలక పాత్ర కోసం ఆమెను చిత్రబృందం సంప్రదించినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చర్చలు ఫలిస్తే.. రణ్‌బీర్ కపూర్‌తో కలిసి అనీత్ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉంది. ‘ఫిల్మ్‌ఫేర్’ కథనం ప్రకారం.. ఆమెతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఓ సినీ వర్గం తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘బ్రహ్మాస్త్ర 2లో ఓ కీలక పాత్ర కోసం అనీత్‌ను సంప్రదించారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇంకా ఏదీ ఖరారు కాలేదు’’ అని పేర్కొన్నారు.
* ‘బ్రహ్మాస్త్ర 2’.. ఆసక్తి
ఫాంటసీ ఫ్రాంచైజీలో రెండో భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అనీత్ పడ్డా పేరు తెరపైకి వచ్చింది. ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ – శివ’ 2022లో విడుదలైంది. ఇందులో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, నాగార్జున, మౌనీ రాయ్ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించారు.
* దీపికా ఉందా?
మొదటి భాగం ముగింపులో తదుపరి కథపై ఆసక్తిని పెంచేలా పలు ప్రశ్నలను మిగిల్చారు. ముఖ్యంగా పోస్ట్ క్రెడిట్ సన్నివేశంలో దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ చిన్న చూపు కనిపించింది. ఆమె ముఖాన్ని స్పష్టంగా చూపించకుండా.. ఓ చిన్నారిని ఎత్తుకుని ఉన్నట్లుగా చూపించారు. దీంతో ‘బ్రహ్మాస్త్ర 2’లో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందనే దానిపై అప్పట్లో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
* ‘సైయారా’తో గుర్తింపు
అనీత్ పడ్డా గతేడాది విడుదలైన ‘సైయారా’ సినిమాతో ఆమెకు విస్తృత గుర్తింపు లభించింది. ప్రస్తుతం అనీత్ ‘శక్తి శాలిని’ అనే మరో ఆసక్తికరమైన చిత్రంలో నటిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
