Collector Chahat Bajpai, Bhadrakali Bund Development works
* నాణ్యతతో పనులు పూర్తి చేయాలి
* కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
ఆకేరు న్యూస్, హనుమకొండ: భద్రకాళి బండ్‌ను పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసేందుకు చేపట్టిన పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. శనివారం భద్రకాళి బండ్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ఇప్పటికే పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రానైట్ పనులు, పాత్‌వేలు, గ్రీనరీ, లైటింగ్, డ్రైనేజీ తదితర పనులు పూర్తయినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బండ్ పరిసరాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాలను గుర్తించి విరివిగా మొక్కలు నాటాలని ఆదేశించారు. భద్రకాళి బండ్లో పచ్చదనాన్ని పెంచుతూ గ్రీనరీని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్ణీత సమయంలో అన్ని పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ ఎస్ఈ రాజ్‌కుమార్, ఈఈ రవికుమార్, డీఈలు, ఏఈలు, హార్టికల్చర్ అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
