Harish Rao
* శాంతిభద్రతలు క్షీణించాయి..
* మాజీ మంత్రి హరీశ్‌రావు
* జవహర్‌నగర్‌లో అరెస్ట్.. విడుదల
అకేరు న్యూస్,హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, వివేకానంద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, మాణిక్యరావులను పోలీసులు అరెస్టు చేసి జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి, సాయంత్రం ఐదు గంటల తరువాత విడుదల చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. గవర్నర్‌పై ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసి మాట వెనక్కి తీసుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఆయనను జైల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ఖండించకపోగా, వారిపైనే కేసులు పెట్టడం దుర్మార్గమని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఫెవికాల్ బంధం ఉందని, అందుకే బీజేపీ ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి బయటకు గెంటివేశారని ఆరోపించారు.
* అసెంబ్లీలో నిలదీస్తామనే భయమా?
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలదీస్తారనే భయంతోనే ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, రాజశేఖర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, యాదగిరి తదితరులపై దాడులు చేసి గాయపరిచారని తెలిపారు. సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి వంటి మహిళా ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తప్పుబట్టారు. సబితా ఇంద్రారెడ్డిపై దాడికి దిగడమే కాకుండా అసెంబ్లీలో మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
* నాడు ద్రౌపదిని అవమానించిన తీరులోనే..
నాడు ద్రౌపదిని కౌరవులు అవమానించిన తీరులోనే రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన సాగుతోందని, శాసనసభను కౌరవ సభగా మార్చారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నిరాహార దీక్షతో తెలంగాణ సాధించిన కేసీఆర్ ఇంటిపై దాడికి పురిగొల్పడం, పోలీసులను అడ్డుపెట్టి కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనకు సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అసాధ్యంగా మారిందని, ప్రశ్నించే గొంతులపై దాడులు జరుగుతున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. రాష్ట్ర పరిణామాలు ఆయనకు తెలియవా అని ప్రశ్నించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
