Sanghamitra Anti Drug Campaign
* హన్మకొండలో ‘సంఘమిత్ర’
* 1.60 లక్షల మందికి డ్రగ్స్‌పై అవగాహన
ఆకేరు న్యూస్, హన్మకొండ: డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హన్మకొండ జిల్లాలో ‘సంఘమిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్ శాఖ, మహిళా స్వయం సహాయక సంఘాలు, మెప్మా సభ్యుల భాగస్వామ్యంతో శుక్రవారం హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.60 లక్షల మంది సభ్యులకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించి, వారి ద్వారా ప్రతి కుటుంబానికి సందేశాన్ని చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి మహిళా సంఘ సభ్యురాలు ‘సంఘమిత్ర’గా పనిచేసి తన పరిధిలోని కుటుంబాలకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించాలని అధికారులు సూచించారు.
యువతలో ప్రవర్తనా మార్పులను తల్లులు ముందుగానే గుర్తించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. పిల్లలు అకస్మాత్తుగా ఒంటరిగా ఉండటం, కుటుంబ సభ్యులతో మాట్లాడకపోవడం, డబ్బులు ఎక్కువగా అడగడం వంటి మార్పులను నిర్లక్ష్యం చేయవద్దన్నారు.
సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో మహిళల పాత్ర కీలకమని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, ప్రదేశాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారదాతల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. డ్రగ్స్‌కు బానిసైన వారికి కౌన్సెలింగ్, వైద్య సహాయం, కుటుంబ సహకారం అందించాలని సూచించారు.
కార్యక్రమంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన స్కిట్, ప్రత్యేక వీడియోల ప్రదర్శన నిర్వహించారు. గతంలో డ్రగ్స్‌కు బానిసై బయటపడిన వ్యక్తి తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
