Uppalpalle Government School Reopening
* ఉప్పల్ పల్లెలో రెండేళ్ల తర్వాత మళ్లీ తెరుచుకున్న పాఠశాల
– నాణ్యమైన విద్యే లక్ష్యం ఎంఈఓ కే. శ్రీధర్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ పల్లె లో 2022-23లో విద్యార్థులు లేక మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గురువారం పునఃప్రారంభం అయ్యింది. 1-5 తరగతి వరకు మొత్తం 11 మంది విద్యార్థులతో ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాల పునఃప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంఈఓ కె. శ్రీధర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి ఒక్క బాలబాలికకు నాణ్యమైన విద్య అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, తల్లిదండ్రులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను ఎంఈఓ కే.శ్రీధర్, సర్పంచ్ ర్యాకం శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
* గ్రామస్తుల కృతజ్ఞతలు
పాఠశాల పునఃప్రారంభానికి శ్రమించి, సహకరించిన ప్రతి ఒక్కరికీ స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మూతబడ్డ పాఠశాల మళ్లీ తెరుచుకోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే భారం తప్పిందని, తమ పిల్లలకు ఇక్కడే నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలోని పిల్లల భవిష్యత్తు కోసం, విద్యా అవకాశాలను మరింత మెరుగుపరిచేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని గ్రామస్తులు సంకల్పించారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూర్గుల నాగరాజు, వార్డు మెంబర్ అంబరకొండ శ్రీనివాస్, సి.ఆర్.పీ సుభాష్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
