AISF Leaders submit request memorandum to MP kadiyam kavya
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
పార్లమెంటులో ప్రవేశపెట్టే వికసిత్ భారత్ శిక్ష అధిష్టానం (విబిఎస్ఏ) బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్యకి ఏఐఎస్ఎఫ్ జనగామ జిల్లా కమిటీ వినతి పత్రం అందించారు. ఈనెల 20 నుండి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం విద్యారంగ విధానానికి వ్యతిరేకంగా, సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను కాలరాసే వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు (2025) పార్లమెంట్లో వ్యతిరేకించాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ కుమార్ యాదవ్ కి వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా జనగామ జిల్లా కన్వీనర్ ఎండి యునుస్ మాట్లాడుతూ వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు 2025ను ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ పరిమితులను ఉల్లంఘిస్తూ, కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య ఫెడరల్ (సమాఖ్య) విధానాన్ని బలహీనపరుస్తుంది, సంస్థాగత స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్య యొక్క ప్రజాస్వామ్య, సమగ్ర స్వభావాన్ని ముప్పులోకి తీసుకువస్తూ, విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రజాస్వామ్య హక్కులపై ప్రభావాలను చూపుతుంది అన్నారు.
దేశంలో ఉన్నత విద్యారంగ నియంత్రణ సంస్థలైన యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ (UGC), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ (AICTE), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) స్థానంలో ఒకే ఒక సర్వోన్నత సంస్థగా విబిఎస్ఏ (VBSA) ను ఏర్పాటు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తు విద్య రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రగా ఈ బిల్లు ఉందని, విద్యా నియంత్రణ సంస్థలు కేవలం ప్రభుత్వంలో ఒక భాగంగా మారిపోతాయని, వర్సిటీల స్వయంప్రతిపత్తి (Autonomy) పూర్తిగా దెబ్బతింటుందని, బిల్లు ద్వారా ఉన్నత విద్యపై రాష్ట్రాలకు ఉన్న హక్కులను కేంద్రం లాక్కుంటోందని తెలిపారు.
IIT, IIM, NIT, IIIT, IISER కూడా VBSA నియంత్రణలోకి వస్తే విద్యారంగానికి స్వయంకృత ప్రత్తిపతి ఎక్కడుంటుందని యూనస్ ప్రశ్నించారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించేలా ఈ బిల్లు ప్రతిపాదనలు ఉన్నాయని ఇది పూర్తిగా ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందని ఇప్పటికే ఈ బిల్లును విపక్ష పార్టీలతోపాటు, బిజెపి కూటమి పార్టీలు కూడా విబిఎస్ఏ బిల్లును వ్యతిరేకించాయని, ప్రతిపాదిత బిల్లులో పై రాజ్యసభ పార్లమెంట్లో మాట్లాడి బిల్లును అడ్డుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీ ని కలిసిన వారిలో ఏఐఎస్ఎఫ్, జిల్లా నాయకుడు పస్తం పృథ్విరాజ్ , బానోతు తిరుపతి, బుస్సా రోహిత్, నీరటి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
