* తెలంగాణ ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం
* తెలంగాణతో సోనియాది పేగుబంధం
* బిడ్డ ఇంటికి రావడానికి తల్లికి హోదా కావాలా
* 4 కోట్ల ప్రజల హృదయం ఉప్పొంగే క్షణం
* ఆవిర్భావ దినోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆకలినైనా భరిస్తాం.. స్వేచ్ఛను హరిస్తే ఊరుకోబోమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందని, నాలుగు కోట్ల మంది ప్రజల హృదయం ఉప్పొంగే క్షణమని అన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులర్పించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో రేవంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ.. అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు.. అని చెప్పారు. మేమే సర్వజ్ఞానులం అనే భ్రమలో లేకుండా పాలన సాగిస్తున్నామని చెప్పారు. పదేళ్ల గత పాలనలో తెలంగాణ వందేళ్లు విధ్వంసానికి గురైందని విమర్శించారు. సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారిందని తెలిపారు.
ప్రజాపాలన సాగిస్తున్నాం..
ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నామని, మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చామని తెలిపారు. మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించామన్నారు. ప్రజల సమస్య నేరుగా విని, పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇందిరాపార్కులో ధర్నాచౌక్‌కు అనుమతి ఇచ్చామని, మీడియాకు స్వేచ్ఛను ఇచ్చామని, నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ ప్రాధాన్యం అని రేవంత్ వివరించారు.
సగర్వంగా జయజయహే తెలంగాణ
దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో.. అమరుల ఆశయాలు, ప్రజల కలలు నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని ప్రకటించారు. ‘సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం.. ఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి కీలకాంశాలు. ఆ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోంది… ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్తిత్వం. ఆ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. బోనం నుంచి బతుకమ్మ వరకు.. సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి, మన చరిత్ర గొప్పవి. సమ్మక్క సారలమ్మ నుండి జోగులాంబ వరకు.. భద్రాద్రి రాముడు నుంచి కొమురం భీం వరకు, అమరుల త్యాగాలు, హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ సంస్కృతికి, చరిత్రకు పునరుజ్జీవనం జరగాలి. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన ‘జయ జయహే తెలంగాణ..’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నాం. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనానికి తొలి అడుగు.’ అని వివరించారు.
చిహ్నం.. జాతి చరిత్రకు అద్దం
చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దంపడుతుందని, జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే. తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలనేది తమ ఉద్దేశమని వెల్లడించారు. ఉద్యమ సమయంలో టీజీనే రాష్ట్ర సంక్షిప్త అక్షరాలుగా ప్రజలు నిర్ధారించుకున్నారని, యువత తమ గుండెలపై టీజీ అక్షరాలను పచ్చబొట్లుగా పొడిపించుకున్నారని వివరించారు. వారి ఆకాంక్షల మేరకు టీఎస్ స్థానంలో టీజీని పునరుద్ధరిస్తు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.. అంటే, జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి అని అర్థం. తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా ఉండాలి. ఆ తల్లిని చూస్తే.. మన కన్నతల్లి యాదిలోకి రావాలి. సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమే.. తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి.. కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి. త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపం సిద్ధం అవుతుంది. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగం. ఈ నిర్ణయాలు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఒక జాతి ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే.
బిడ్డ ఇంటికి రావడానికి తల్లికి హోదా కావాలా..
బిడ్డ ఇంటికి శుభకార్యానికి రావడానికి తల్లికి హోదా కావాలా అని సోనియాను ఉద్దేశించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. ఏ హోదా ఉందని, ఏ పదవిలో ఉన్నారని మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తించుకున్నామని ప్రశ్నించారు. తెలంగాణ ఉన్నంత వరకూ సోనియాను ఈ గడ్డ తల్లిగా గుర్తిస్తుందని, తెలంగాణతో సోనియాది పేగుబంధమని చెప్పారు.
మూడు జోన్లుగా రాష్ట్రం
తెలంగాణ రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ది చేయనున్నట్లు రేవంత్ తెలిపారు. హైదరాబాద్ ఓఆర్ ఆర్ పరిధిలోని ప్రాంతం అర్బన్ కేంద్రంగా, ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతం సబ్ అర్బన్ తెలంగాణగా, రీజినల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణగా విభజించనున్నట్లు వివరించారు. డ్రగ్స్ కేసుల్లో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రజాపాలనలో కోటి 9 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటినన్నింటినీ పరిశీలిస్తామని చెప్పారు. స్వల్పకాలిక ఆలోచనలు కాదు… దీర్ఘ కాలిక ప్రణాళికలతో భవిష్యత్ కు పునాదులు వేస్తున్నామని, మొత్తం తెలంగాణకు ‘గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్’ రూపొందిస్తామని చెప్పారు. మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని వివరించారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు భర్తీ
యువత ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. 70 రోజుల్లోనే 30 వేల మంది యువతకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ నెల తొమ్మిదిన ప్రాథమిక పరీక్ష జరగబోతోంది. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చాం. వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచాం. ప్రభుత్వంలో ఖాళీలను భర్తీ చేస్తాం.. అని, పేదల ఇళ్ల కోసం ఒక్క ఏడాదిలోనే రూ.22,500 కోట్లు వెచ్చించామని వివరించారు. అలాగే రైతును రాజును చేయడం మా సంకల్పం అని వెల్లడించారు.
———————————