Seethakka
* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, రంగారెడ్డి: గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి సీతక్క (Minister Seethakka) అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల ప్రాంతీయ సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. పనుల పురోగతి, పెండింగ్ పనులు, వాటి పూర్తికి ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
* హ్యామ్ రహదారులపై ప్రత్యేక దృష్టి
గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చేపడుతున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీతక్క సూచించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులో పనులు పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. రహదారి పనుల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు.
* తాగునీటిపై ముందస్తు చర్యలు
ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలోనే ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను ముందుగానే అంచనా వేసి, నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
పెండింగ్లో ఉన్న తాగునీటి పనులను గుర్తించి త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరమైన మరమ్మతులు ముందుగానే చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
* భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలి
గ్రామ పంచాయతీ భవనాలతో పాటు వీఓ, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని సీతక్క ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు నిర్మాణాలు ప్రారంభం కాని ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
* క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలి
గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని మంత్రి సీతక్క తెలిపారు. నిధులు, అనుమతులు, సాంకేతిక సమస్యల కారణంగా పనులు నిలిచిపోకుండా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.
రహదారులు, తాగునీరు, పంచాయతీ, వీఓ, అంగన్వాడీ భవనాలు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సీతక్క స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
