Singeetham Srinivasa Rao
* ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి
ఆకేరు న్యూస్, చెన్నై : తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలితో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. 94 ఏళ్ల వయసులో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
1972లో ‘నీతి నిజాయితీ’ చిత్రంతో దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు సినీ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో సుమారు 60 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ప్రయోగాత్మక కథలు, విభిన్నమైన స్క్రీన్ప్లే, కొత్త తరహా చిత్రీకరణతో సింగీతం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘మయూరి’ వంటి చిత్రాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి.
ముఖ్యంగా ‘పుష్పక విమానం’ మాటలు లేకుండా తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రంగా ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
కేవలం దర్శకుడిగానే కాకుండా కథ, స్క్రీన్ప్లే, సాంకేతిక అంశాలపై లోతైన అవగాహన ఉన్న సినీ ప్రముఖుడిగా సింగీతం పేరు సంపాదించుకున్నారు. వయసు పెరిగినా సినిమాపై ఆయనకున్న ఆసక్తి కొనసాగింది. చివరిగా ‘సింగ్ గీతం’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో విభిన్నమైన చిత్రాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
