Tamil Nadu Anti Narcotics Task Force, ai generated image
* రూ.264.14 కోట్లతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
* రాష్ట్రవ్యాప్తంగా 65 ప్రత్యేక ANTF యూనిట్లు
* సీఎం విజయ్ ప్రత్యక్ష నియంత్రణలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్
* చెన్నైలో అత్యధికంగా 12 యూనిట్లు
* ప్రత్యేక సైబర్ ల్యాబ్.. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ క్లబ్‌లు
* పాఠశాలల చుట్టూ 100 మీటర్ల పరిధి ‘నో టొబాకో జోన్’
ఆకేరు న్యూస్, చెన్నై:
డ్రగ్స్ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వ్యాప్తిపై పోరును మరింత పటిష్ఠం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ (ANTF) ఏర్పాటు కోసం రూ.264.14 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ముఖ్యమంత్రి విజయ్ ప్రత్యక్ష నియంత్రణలో పనిచేయనుంది.
* ఏడీజీపీ ( ADGP ) నేతృత్వంలో ప్రత్యేక బలగం
యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ ( ANTF ) కు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. ఆయనకు సహాయంగా ఒక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP), ముగ్గురు సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ (SP) పనిచేస్తారు. ఈ ప్రత్యేక బలగం కోసం 65 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు, 260 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 1,300 మంది పోలీస్ సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసింది.
* రాష్ట్రవ్యాప్తంగా 65 ప్రత్యేక యూనిట్లు
తమిళనాడు వ్యాప్తంగా మొత్తం 65 ప్రత్యేక యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ ( ANTF ) యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 37 యూనిట్లను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించనున్నారు. మిగిలిన 28 యూనిట్లను తొమ్మిది నగర పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేయనున్నారు.అత్యధికంగా చెన్నైకి 12 యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ ( ANTF ) యూనిట్లు కేటాయించారు. ఆవడి, తాంబరం, సేలం, కోయంబత్తూరు, తిరుప్పూర్, తిరుచిరాపల్లి, మదురై, తిరునెల్వేలికి రెండేసి యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.
* డ్రగ్స్ నెట్‌వర్క్‌పై నిఘాకు ప్రత్యేక విభాగాలు
యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ (ANTF )ను కేవలం పోలీసు బలగంగా కాకుండా డ్రగ్స్ నెట్‌వర్క్‌ను వివిధ కోణాల్లో ఎదుర్కొనే ప్రత్యేక వ్యవస్థగా తీర్చిదిద్దనున్నారు.ఆపరేషన్స్, ఫీల్డ్ ఇంటెలిజెన్స్, స్పెషల్ ఆపరేషన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్, సైబర్ సపోర్ట్, క్రైమ్ రికార్డ్స్, కంట్రోల్ రూమ్, శిక్షణ–సామర్థ్య అభివృద్ధి, పరిపాలన, మోటార్ ట్రాన్స్పోర్ట్, ఐటీ సపోర్ట్, న్యాయ సేవల కోసం ప్రత్యేక విభాగాలు ఉంటాయి. లీగల్ అడ్వైజర్ నేతృత్వంలో ప్రత్యేక లీగల్ యూనిట్ కూడా పనిచేస్తుంది.
* ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్
డ్రగ్స్ అక్రమ రవాణాలో సాంకేతిక పరిజ్ఞానం, ఆన్లైన్ నెట్‌వర్క్‌ల వినియోగాన్ని గుర్తించేందుకు ANTFలో ప్రత్యేక సైబర్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నారు.ఇందుకోసం ఇద్దరు సైబర్ నిపుణులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఒక్కో నిపుణుడికి నెలకు రూ.లక్ష వేతనం చెల్లించనున్నారు.
* డ్రగ్ అండ్ టొబాకో ఫ్రీ తమిళనాడు
ANTF ఏర్పాటుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ‘డ్రగ్ అండ్ టొబాకో ఫ్రీ తమిళనాడు’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ముఖ్యమంత్రితో కలిసి ప్రతిజ్ఞా కార్యక్రమంలో పాల్గొని, మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు.డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు, Narcotic Drugs and Psychotropic Substances (NDPS) Act కింద విధించే శిక్షలు, విద్యాసంస్థలు తీసుకోగల క్రమశిక్షణ చర్యలు, కౌన్సెలింగ్, చికిత్స అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.విద్యార్థులు స్వచ్ఛందంగా యాంటీ డ్రగ్ అఫిడవిట్లు సమర్పించేలా ప్రోత్సహించనున్నారు. అన్ని విద్యాసంస్థల్లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలతో పాటు యాంటీ డ్రగ్ క్లబ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
* స్కూళ్ల చుట్టూ 100 మీటర్లు ‘నో టొబాకో జోన్’
పాఠశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల చుట్టూ 100 మీటర్ల పరిధిని ‘నో టొబాకో జోన్’గా గుర్తించనున్నారు.ప్రజలను డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములను చేసేందుకు ‘Drug-Free Tamil Nadu’ యాప్‌ను ప్రభుత్వం ప్రారంభించింది.
మాదకద్రవ్యాల విక్రయం, సరఫరా, అక్రమ రవాణా లేదా వాటి వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలు ఈ యాప్ ద్వారా అధికారులకు తెలియజేయవచ్చు. ఫిర్యాదులు కూడా నమోదు చేయవచ్చు.
* 15 మంది పోలీసులకు పతకాలు
డ్రగ్స్‌పై పోరాటంలో విశేషంగా పనిచేసిన 15 మంది పోలీసు అధికారులను పతకాలతో సత్కరించారు. యాంటీ డ్రగ్ క్లబ్‌ల ద్వారా ఉత్తమ పనితీరు కనబరిచిన పాఠశాలలు, కళాశాలలను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఉత్తమంగా నిలిచిన విద్యాసంస్థలకు వరుసగా రూ.1 లక్ష, రూ.75 వేలు, రూ.50 వేల నగదు బహుమతులు అందించారు.
* పోలీసింగ్‌తో పాటు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంలో రెండు వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు రూ.264.14 కోట్లతో ప్రత్యేక పోలీసు–ఇంటెలిజెన్స్ వ్యవస్థను నిర్మిస్తుండగా, మరోవైపు విద్యాసంస్థల నుంచే డ్రగ్స్ వినియోగాన్ని నిరోధించేందుకు అవగాహన, కౌన్సెలింగ్, యాంటీ డ్రగ్ క్లబ్‌లపై దృష్టి పెట్టింది.డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను పోలీసింగ్‌తో ఛేదించడం.. కొత్త తరం మాదకద్రవ్యాల బారిన పడకుండా విద్యాసంస్థల స్థాయిలోనే అడ్డుకోవడం.. ఈ రెండు మార్గాల్లో తమిళనాడు ప్రభుత్వం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లనుంది.
—————————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
