* ముంపు ముప్పుపై ముందస్తు అంచనలో విఫలం
* సింగ్ నగర్, రాజరాజేశ్వరీనగర్‌లో దారుణ పరిస్థితికి కారణం అదే
* అధికార వ్యవస్థపై స్థానికుల ఆగ్రహం
* ముందుగా అప్రమత్తం చేస్తే బయటపడేవారమని ఆవేదన
* ఆదివారం, అమావాస్య కూడా కారణాలేనట?
* బుడమేరు నిండా ఆక్రమణలే..
* 20 ఏళ్ల క్రితం నాటి ప్రతిపాదనలపై నిర్లక్ష్యం
* భవిష్యత్‌పై పాలకులకు ముందు చూపుకరువు
* అవే ఇప్పుడు విజయవాడను ముంచేశాయి..
ఆకేరు న్యూస్, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యపట్టణం విజయవాడ(Vijayawada) “విలయ”వాడగా మారింది. ఎక్కడ చూసినా నీళ్లే.. ఏ రోడ్డుపై చూసినా వరద పరవళ్లే.. మీడియాలోనే కాదు.. వాట్సప్ గ్రూపులు, సోషల్‌మీడియా లోనూ విజయవాడ ముంపు దృశ్యాలే కనిపిస్తున్నాయి. దాదాపు 50 వేల ఇళ్లకు (Fifty Tousands Houses)పైగా నీళ్లలోనే ఉన్నాయి. 2 లక్షల మంది వరద బాధితులుగా మారారు. తాగునీరు(Water), ఆహారం(Food) కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా సింగ్ నగర్(Singh Nagar), రాజరాజేశ్వరీనగర్(Raja Rajeswari Nagar)లో పరిస్థితి దారుణంగా ఉంది. ముంపుపై ముందస్తు అంచనా వేయకపోవడంలో నిర్లక్ష్యమే తమ కొంప ముంచిందని బాధితులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా అప్రమత్తం చేస్తే బయట పడేవారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా మొదటి అంతస్తు వరకు కూడా నీళ్లు వెళ్లాయి. పాలు, బిస్కెట్ ప్యాకెట్ల కోసం బాధితులు ఎగబడుతున్నారు. పిల్లలకు తిండి కోసం తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచింది. ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఎటూ వెళ్లేందుకుదారి లేదు. రోడ్లపై పడవల్లో ప్రయాణిస్తున్నారు. బుడమేరు(Budameru) వాగు పొంగిపొర్లడంతో ఎన్నడూ మునగని ప్రాంతాల్లోనూ వరద ఉప్పొంగింది. ముంపు ముప్పును ముందస్తుగా అంచనా వేయడంలో యంత్రాంగం విఫలం కావడం, బుడమేరు ఆక్రమణలు, భవిష్యత్ లో ముంపు ముప్పు తలెత్తకుండా 20 ఏళ్ల క్రితమే ప్రణాళికలు రూపొందించినా, అమలులో పాలకులు నిర్లక్ష్యం వహిస్తూ ఉండడం.. ప్రస్తుత దుస్థితికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఆక్రమణలకు అండగా…
బుడమేరు(Budameru) ఉగ్రరూపం దాల్చినపుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలు చోట్ల మలుపులు ఏర్పడ్డాయి. రెండు, మూడు దశాబ్దాల క్రితం నాలుగైదేళ్ల క్రితం బుడమేరుకు వరదలు వచ్చినా పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి. బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊళ్లను ముంచెత్తుతున్నాయని, విజయవాడ, నిడమానూరు ప్రాంతాల్లో ఉన్న “యూ ” టర్నింగ్‌లను సవరించాలని 20ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది. బుడమేరును ఆక్రమణల నుంచి విడిపించి దాని గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలని ప్రతిపాదించారు. విజయవాడ మార్కు రాజకీయం(Vijayawada Polictics) ఆ పనుల్ని అడ్డుకుంది. ఇళ్లను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరించడంతో ప్రభుత్వం కూడా వదిలేసింది. ఇదే అదనుగా బుడమేరును యథేచ్ఛగా ఆక్రమించేశారు. ఇక వీటీపీఎస్ నుంచి ప్రవహించే వరద ప్రవాహ మార్గంలో ఉన్న నిర్మాణాలు కూడా విజయవాడ ముంపునకు కారణమవుతున్నాయి. వాటిని సరిచేసే సంకల్పం ఏ పార్టీకి లేకపోవడమే ప్రస్తుత పరిస్థితి కారణమైంది.
అందుకే బుడమేరు కట్టలు తెంచుకుంది..
ఖమ్మం జిల్లా(Khamam District)లో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్లో గరిష్టంగా 11వేల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70వేల క్యూసెక్కులకు చేరింది. బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్‌ను కూడా 70వ దశకంలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam), గొల్లపూడి(Gollapudi), విజయవాడ రూరల్ మీదుగా నగరంలోకి ఇది ప్రవేశిస్తోంది. తాజా నిర్ణయాలతో పాటుగా 20 ఏళ్ల నిర్లక్ష్యం విజయవాడను ముంచేసింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హోరెత్తిన చిన్నా, పెద్ద వాగులను కలుపుకొని పూనకమొచ్చినట్లుగా విరుచుకుపడింది. బుడమేరు పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి జలం ప్రవేశించింది. చూస్తుండగానే ఒక్కో అడుగు పెరుగుతూ పోయింది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు (Kolleru)అర్థాంతరంగా నిలిచిపోవడంతో నేడు దాని ఫలితం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కాయి. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్టకు ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేవు. కాలనీలకు కాలనీలను విస్తరించారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల నేతలు పాత్రధారులే. విజయవాడలో ఆక్రమణలతో జల ప్రవాహానికి తగిన దారిలేకుండా పోయింది. దీంతో, బుడమేరు కట్టలు తెంచుకున్నట్లుగా చెలరేగిపోయింది.
20 ఏళ్ల నిర్లక్ష్యానికి మూల్యం….
20ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో విజయవాడ నగరంలో న్యూ రాజరాజేశ్వరి పేట, సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రోజుల తరబడి ప్రజలు వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. బుడమేరుకు వెలగలేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడకు వరద ముంపు తప్పిపోయింది. 2008 నుంచి విజయవాడ రూరల్(Vijayawada Rural) మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో మరో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్టెన్షన్, నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి. అంతకు ముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతమనే సంగతిని పూర్తిగా విస్మరించారు.
గండిపడడంతో…
తాజా ముంపు వెనుక తాజా భారీ వర్షాలతో ఇబ్రహీంపట్నం మండలం తలప్రోలు వద్ద బుడమేరుకు గండి పడింది. వెలగలేరు వంతెన వద్ద 11 షట్టర్లను 11 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదలటంతో ఆ ప్రభావం విజయవాడ నగరంపై పడింది. వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. కృష్ణ వరద వెనక్కుతన్ని ఎన్టీపీఎస్ ప్లాంట్ లోకి నీరు చేరే ప్రమాదం ఉందని ఒత్తిళ్లు రావటంతోనే వెలగలేరు షట్లర్లను శనివారం రాత్రికి రాత్రి ఎత్తటంతోనే విజయవాడను వరద ముంచెత్తినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
నిన్న ఆదివారం.. ఈ రోజు అమావాస్య కావడంతో..
విజయవాడలో నిన్న, ఈ రోజు అంతగా వర్షాలు లేకపోయినా, వరద తగ్గుముఖం పట్టకపోవడానికి మరో వాదన ప్రచారం జరుగుతోంది. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో చాలామంది ఇరిగేషన్ అధికారులు(Irigation Offecers) ఇళ్లకే పరిమితం అయ్యారని, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు (Cm Chandrababu)వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతున్నా, అధికారులు క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే సోమవారం కూడా కొంచెమైనా వరద ప్రవాహం తగ్గలేదని స్థానికులు వాపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. రోడ్లపైనా, కాలనీల్లోని వరద, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద వివిధ కాలువలు, నీటి మళ్లింపు మార్గా ద్వారా కృష్ణానదిలోకి వచ్చి ఉప్పొంగుతోంది. దీంతో 11.47 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. అయితే, ఈరోజు అమావాస్య కావడంతో సముద్రం ముందుకొస్తోందని, తగినస్థాయిలో నీటిని లాక్కోకపోవడం వల్ల.. వరద ప్రవాహం వేగంగా తగ్గడం లేదని మరికొందరు చెబుతున్నారు.