Fee Reimbursement ABVP Protest
* ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేతకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది
– ABVP రాష్ట్ర కార్యదర్శి రాంబాబు
* కాకతీయ యూనివర్సిటీలో స్టడీ సర్కిల్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
ఆకేరు న్యూస్, వరంగల్:
కాకతీయ యూనివర్సిటీలోని జాఫర్ నిజాం సెమినార్ హాల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్ కార్యక్రమం నిర్వహించారు. యూనివర్సిటీ శాఖ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
* ‘పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నం’
పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని రాంబాబు ఆరోపించారు. ఈ చర్యలను ABVP తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.
* హైకోర్టు వ్యవహారంపై విమర్శలు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రైవేట్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించిన సందర్భంగా ప్రభుత్వం సమయానికి కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్లే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయని ఆయన ఆరోపించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
* రూ.12 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలి
ప్రతి ఏడాది సుమారు 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని రాంబాబు తెలిపారు. ప్రభుత్వం రూ.12 వేల కోట్లకు పైగా బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. విద్యపై చేసే ఖర్చు సంక్షేమ పథకం కాదని, దేశ అభివృద్ధికి అవసరమైన మానవ వనరులపై పెట్టుబడిగా చూడాలని సూచించారు.
* ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ABVP
ఎన్నికల సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత విరుద్ధంగా వ్యవహరిస్తోందని రాంబాబు విమర్శించారు. పేద విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడొద్దని, వెంటనే బకాయిలు విడుదల చేసి పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ యూనివర్సిటీ కన్వీనర్ అంబాల కిరణ్, వరంగల్ విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీ పృథ్వీరాజ్‌తో పాటు మహేష్, వినోద్, పవన్, శివ, పవన్ కళ్యాణ్, వీక్షిత, శ్రీవన్య, సాయి తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
