Bhadrachalam Godavari Flood Warning
ఆకేరు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం 49.8 అడుగులకు చేరుకుని రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి (48 అడుగులు)ను దాటింది. ప్రస్తుతం నదిలో 12.24 లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు ప్రవహిస్తోంది. నీటిమట్టం మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి (53 అడుగులు) వైపు వేగంగా చేరుకుంటుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
* ప్రజలకు కలెక్టర్ సూచనలు
గోదావరి వరదల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ (IAS) లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆలస్యం చేయకుండా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు.
పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, విద్యుత్, వైద్య సేవలు, పారిశుద్ధ్య సౌకర్యాలతో పాటు మహిళలు, చిన్నారులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
* అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి..
రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF), డీఆర్ఎఫ్ (DRF) బృందాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
* సెల్ఫీల కోసం నదిలోకి వెళ్లొద్దు..
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (IPS) ప్రజలకు కీలక సూచనలు చేశారు. గోదావరి నదిలోకి దిగడం, ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు లేదా వీడియోలు తీసేందుకు వెళ్లొద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలు పనిచేసే భద్రాచలం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని కోరారు.
ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
Flood Control Room: 08744-241950
WhatsApp: 9392919743
Please tell us what is wrong. Your report will be sent to the website team.
