Kamalapur Mandal Meeting
*మండల సర్వసభ్య సమావేశంలో దద్దరిల్లిన ప్రజా సమస్యలు
– యూరియా, విద్యుత్, వైద్యం, బెల్ట్ షాపులపై అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు
* నెల రోజుల్లోగా ప్రజా సమస్యలు పరిష్కరించాలి – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్:
కమలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి వేడుకల అనంతరం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం తీవ్ర వాడీవేడీగా, రసాభాసగా సాగింది. గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలపై సభలో అధికారులతో తీవ్ర చర్చ జరిగింది.
* యూరియా యాప్ విధానం రద్దుకు డిమాండ్
మండలంలో ఎరువుల పంపిణీకి సంబంధించిన యాప్ బుకింగ్ విధానంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సర్పంచ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. యాప్ విధానం వల్ల రైతులు ఎరువులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందిస్తూ.. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యాప్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, నేరుగా ఎరువుల షాపుల ద్వారానే ఎరువులు అందించాలని అన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్పంచ్‌కు, ఎమ్మెల్యేకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
* ప్రభుత్వ ఆసుపత్రులు, పల్లె దవాఖానాలపై సర్పంచుల విమర్శలు
గ్రామీణ వైద్య సేవల తీరుపై సర్పంచులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డిజిటల్ ఎక్స్-రే సౌకర్యం లేకపోవడం, గుండెపోటు బాధితులకు వైద్యం అందుబాటులో లేకపోవడంపై కమలాపూర్ సర్పంచ్ సతీశ్, భీంపల్లి సర్పంచ్ శ్రీనివాస్ మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మాదన్నపేట గ్రామంలో పల్లె దవాఖానా భవనం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరిందని, వైద్యులు బదిలీ కావడంతో సేవలు కుంటుపడ్డాయని సర్పంచ్ కత్తి రమేష్ సభ దృష్టికి తెచ్చారు.
* బెల్ట్ షాపుల అక్రమ విక్రయాలపై ప్లేకార్డులతో నిరసన
మండలంలో బెల్ట్ షాపుల అక్రమ విక్రయాలపై సర్పంచ్ పబ్బు సతీష్ ప్లేకార్డులతో అధికారుల తీరును తీవ్రంగా ఎండగట్టారు. మండలంలో రాత్రింబవళ్లు బెల్ట్ షాపులు నడుస్తున్నా అబ్కారీ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
* విద్యుత్ అధికారులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం
శనిగరం గ్రామానికి లైన్మెన్, జూనియర్ లైన్మెన్ లేకపోవడంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విద్యుత్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సిబ్బందిని నియమించి నిరంతరాయంగా సేవలు అందించాలని ఆదేశించారు.
ప్రజల ఇళ్లపై నుండి ప్రమాదకరంగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ తీగలను తొలగించాలని, మిషన్ భగీరథ ద్వారా నాణ్యమైన తాగునీటిని నిరంతరం సరఫరా చేయాలని ఆదేశించారు. కాగా, కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించాలని, గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలంటూ సభలో తీర్మానించారు. సర్పంచులు లేవనెత్తిన ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అధికారులను హెచ్చరించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం ఝాన్సీ రాణి , ఎంపీడీవో గుండె బాబు, తహశీల్దార్ సురేష్, స్పెషల్ ఆఫీసర్ సత్యవతి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
