Mulugu Collector Bhorkhade Hemant Sahadeorao , Revanth Reddy Mulugu visit arrangements
* ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలి
* నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి పరిసరాలను ఆకర్షణీయంగా సుందరీకరించాలి
– జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ఆకేరు న్యూస్, ములుగు:
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన ములుగు జిల్లా పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు పరిసరాలను ఆకర్షణీయంగా సుందరీకరించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్‌తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌ను, గట్టమ్మ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ నిర్మాణం పనులను పరిశీలించి, గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హెలిప్యాడ్ వద్ద చేపడుతున్న బారికేడింగ్, వీవీఐపీ వేచి ఉండే టెంట్, భద్రతా ఏర్పాట్లతో పాటు పైలాన్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. పైలాన్ నిర్మాణం, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆకర్షణీయంగా సుందరీకరించాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్ స్థలాలు, భద్రత తదితర అంశాలను సమీక్షించి, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని పరిశీలించారు. కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న పైలాన్ పనులు, సమావేశ మందిరం, స్టేట్ బోర్డ్ ఛాంబర్, జిల్లా కలెక్టర్ ఛాంబర్ తో పాటు వివిధ కార్యాలయ గదులను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, కార్యాలయాలు, పరిసరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) సీహెచ్ మహేందర్ జి, ఆర్డీవో కృష్ణవేణి, మునిసిపల్ కమిషనర్ సంపత్ కుమార్, డీఎస్పీ రవీందర్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ములుగు తహసీల్దార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
