Actor Prakash raj
ఆకేరున్యూస్, హైదరాబాద్ :
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఓటు హక్కు తొలగించారంటూ చేసిన ఆరోపణలపై ఎన్నికల అధికారులు స్పష్టత ఇచ్చారు. బెంగళూరులో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తన పేరు తొలగించారని ప్రకాశ్ రాజ్ ఆరోపించగా.. ఆయన పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించలేదని బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ వెల్లడించింది.
* ఓటును ఎలా తీస్తారని నిలదీసిన విలక్షణ నటుడు
ప్రకాశ్ రాజ్ మంగళవారం సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో.. బెంగళూరులో సర్ ప్రక్రియలో తొలగించిన 65 లక్షల ఓట్లలో తన ఓటు కూడా ఉందని పేర్కొన్నారు. తాను బెంగళూరులోనే పుట్టి, పెరిగి, చదువుకున్నానని, ఇదే ప్రాంతం నుంచి 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశానని గుర్తుచేస్తూ.. తన ఓటును ఎలా తొలగిస్తారని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఓటు హక్కును తిరిగి పొందేందుకు అవసరమైన పత్రాలు ఏమిటో తెలుసుకుంటానని తెలిపారు.
* అధికారుల వివరణ
జూన్ 16, 2026న సర్ కోసం ఓటర్ల డేటాను ఫ్రీజ్ చేసిన సమయంలోనూ ప్రకాశ్ రాజ్ పేరు శాంతినగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో యాక్టివ్గా ఉంది. అనంతరం బూత్ లెవల్ అధికారి ఇంటింటి తనిఖీ చేపట్టారు. ప్రకాశ్ రాజ్ గతంలో నమోదైన గార్డెన్ అపార్ట్మెంట్ చిరునామాలో కొంతకాలంగా నివసించడం లేదని స్థానికులు, ప్రాపర్టీ మేనేజర్, ఫ్లాట్ యజమాని ధ్రువీకరించినట్లు అధికారులు తెలిపారు.
* ఫారం 6 దరఖాస్తు చేసుకోవాలి
దీంతో ఆయన ఓటరు వివరాల్లో షిఫ్ట్ గా నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం శాంతినగర్ నియోజకవర్గంలోని మరో చిరునామాలో నివసిస్తున్నట్లు ఫోన్లో ధ్రువీకరించారని కూడా అధికారులు తెలిపారు. ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు సూచించారు. ప్రకాశ్ రాజ్ చేసిన ఆరోపణలను పరిశీలించిన అనంతరం అవి వాస్తవం కాదని అధికారులు పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
