Telangana folk singer Balli Surender felicitated in Karnataka
ఆకేరు న్యూస్, భూపాలపల్లి : కళకు సరిహద్దులు లేవని, ప్రతిభ ఉంటే ఏ ప్రాంతంలోనైనా గుర్తింపు లభిస్తుందని నిరూపించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం చండ్రుపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ ప్రజా గాయకుడు, ‘గానగంధర్వ’ అవార్డు గ్రహీత బల్లి సురేందర్. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఆయనకు లభించిన అరుదైన గౌరవం తెలంగాణ కళారంగ గర్వించదగ్గ విషయంగా మారింది.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కర్ణాటకలోని ఘాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్లిన బల్లి సురేందర్‌ను కర్ణాటక రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రధాన కార్యదర్శి మరియు రాయచూర్ జిల్లా ఇన్చార్జి రాజగోపాల్ రెడ్డి ముదిరాజ్ ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఆయన సేవలను కొనియాడారు.
* ఈ సందర్భంగా బల్లి సురేందర్ మాట్లాడుతూ..
గతంలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా తాను తన కళాబృందంతో కలిసి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించానని గుర్తుచేసుకున్నారు. ఆటపాటలతో, విప్లవ గీతాలతో ప్రజలను ఆకట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ విధానాలను ఇంటింటికీ చేరవేశామని తెలిపారు. నాటి ఎన్నికల ప్రచారంలో తమ కళాబృందం అందించిన సేవలను, పార్టీ విజయం కోసం చేసిన నిరంతర కృషిని గుర్తించి కర్ణాటక కాంగ్రెస్ నాయకులు ఈ సత్కారం చేయడం తన జీవితంలో మరువలేని అనుభూతి అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఒక సాధారణ మారుమూల గ్రామం నుంచి వచ్చి, కళారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటూ నేడు పొరుగు రాష్ట్రంలోనూ అరుదైన సత్కారం అందుకోవడం పట్ల బల్లి సురేందర్ గ్రామస్థులు, స్థానిక కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సాధించిన ఈ విజయం యువ కళాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో ఆయన మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
