Actress Rani Mukerji Honorary Doctorate
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
బాలీవుడ్ ప్రముఖ నటి రాణి ముఖర్జీకి మరో అరుదైన గౌరవం దక్కింది. దాదాపు మూడు దశాబ్దాలుగా భారతీయ సినీ పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ పురస్కారాన్ని అందించింది. మెల్బోర్న్లో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో భాగంగా ఆగస్టు 14న ఫెడరేషన్ స్క్వేర్లో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
* భావోద్వేగానికి గురైన రాణి
గౌరవ డాక్టరేట్ అందుకున్న సమయంలో రాణి ముఖర్జీ భావోద్వేగానికి లోనయ్యారు. తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె ఆనందం, గర్వంతో కన్నీటిపర్యంతమైనట్లు కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ గౌరవం తనకు ఎంతో వినయాన్ని, ఆనందాన్ని కలిగించిందని రాణి పేర్కొన్నారు. తన జీవిత ప్రయాణంలో సినిమానే గొప్ప గురువుగా నిలిచిందని ఆమె అన్నారు.
* 30 ఏళ్లు గా బాలీవుడ్ లోనే
రాణి ముఖర్జీ దాదాపు 30 ఏళ్లుగా బాలీవుడ్లో కొనసాగుతున్నారు. బ్లాక్, నో వన్ కిల్డ్ జెస్సికా, హిచ్కీ, మర్దానీ సిరీస్, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే వంటి చిత్రాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. మహిళల హక్కులు, సామాజిక న్యాయం, దివ్యాంగుల సమస్యలు వంటి అంశాలను తెరపైకి తీసుకువచ్చిన పాత్రల్లో ఆమె నటించారు. సినిమాలతో పాటు మహిళలు, పిల్లలు, అణగారిన వర్గాలకు సంబంధించిన సామాజిక కార్యక్రమాలకు కూడా రాణి తన వంతు మద్దతు అందించారు.
* రెండో భారతీయ సినీ ప్రముఖురాలు
ఈ గౌరవాన్ని అందుకున్న రెండో భారతీయ సినీ ప్రముఖురాలిగా రాణి ముఖర్జీ నిలిచారు. అంతకుముందు 2019లో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్కు లా ట్రోబ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
