* కోఠి బ్యాంక్ స్ట్రీట్లో నగదు దోపిడీ, ఒకరికి గాయాలు!
ఆకేరు న్యూస్,హైదరాబాద్: మహానగరంలో పట్టపగలే గన్తో దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే కోఠి బ్యాంక్ స్ట్రీట్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఎస్బీఐ (SBI) ఏటీఎం వద్ద నగదు డిపాజిట్ చేస్తున్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.స్థానిక సమాచారం ప్రకారం.. ఒక వ్యక్తి రూ. 6 లక్షల నగదును డిపాజిట్ చేసేందుకు కోఠిలోని బ్యాంక్ స్ట్రీట్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్కు వచ్చారు. అప్పటికే అక్కడ దుండగులు ఉండి, ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. బాధితుడు ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న తుపాకీతో దుండగులు కాల్పులు జరిపారు.ఈ క్రమంలో ఒక బుల్లెట్ బాధితుడి కాలికి బలంగా తగిలింది. ఆయన కిందపడిపోవడంతో, నిందితులు ఆయన వద్ద ఉన్న రూ. 6 లక్షల నగదును లాక్కుని అక్కడి నుంచి వేగంతో పరారయ్యారు.కాల్పుల శబ్దం విన్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, సిసిటివి (CCTV)ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులు ఏ మార్గంలో వెళ్లారనే కోణంలో క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. పట్టపగలే కాల్పులు జరగడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
…………………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
