Kadiyam Srihari school buildings repair
* విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న కడియం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
శిధిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను పాఠశాల పున ప్రారంభానికి ముందే మరమ్మత్తు చేయించాలని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులు ఆదేశించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పాఠశాల చుట్టూ తిరిగి ప్రహరీ గోడ, శిథిలావస్థలో ఉన్న పాత భవనాలు, కిచెన్ షెడ్, తరగతి గదులు, ఆఫీస్ కార్యాలయలను తనిఖీ చేశారు. పాఠశాలకు ఉన్న స్థలం ఎంత ? పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎంత ? పాఠశాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఏంటి ? అనే వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల ప్రహరీ గోడ తొలగించి పాఠశాల పక్కన దారికి 10 అడుగులు ఉండే విధంగా కొత్తగా ప్రహరీ గోడ నిర్మాణం చేయాలని అన్నారు. అలాగే పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న భవనాలను వేంటేనే తొలగించాలని సూచించారు. అలాగే పాఠశాలలో ఉన్న ప్రకృతి వనాన్ని వేరే చోటకు తరలించి పాఠశాలలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ప్రస్తుతం వాడుకలో ఉన్న భవాలకు మరమ్మత్తులు చేపట్టాలని విటన్నింటికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాఠశాల ప్రారంభానికి ముందే ఈ పనులన్నింటిని పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని ఆదేశాలు జారీ చేశారు.
* విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి
అనంతరం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్బంగా రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కౌన్సిలర్లు హరినాథ్, హైమ, సంపత్ రాజ్, కృష్ణవేణి నాయకులు బుర్ల శంకర్, మేకల మల్లేశం, కొంతం శ్రీనివాస్, తోట సత్యం, తోట రమేష్, రేడియో బిక్షపతి, విద్యా శాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
