MLA Kunamneni Arrest | CPI PROTEST
ఆకేరు న్యూస్, హనుమకొండ:
హనుమకొండ నగర పరిధిలోని అదాలత్ జంక్షన్ శనివారం నాటకీయ పరిణామాలకు, తీవ్ర ఉద్రిక్తతకు వేదికగా మారింది. నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో సుదీర్ఘకాలంగా నిర్మించుకున్న గుడిసెలను అధికారులు ముందస్తు సమాచారం లేకుండా, ఏకపక్షంగా కూల్చివేశారంటూ వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనికి నిరసనగా లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో అక్కడ భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు సంఘీభావం తెలపడానికి విచ్చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావును పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
* పోలీస్ జీపును ముట్టడించిన నిరసనకారులు..
ఎమ్మెల్యే కూనంనేని అరెస్టును నిరసిస్తూ సీపీఐ శ్రేణులు, ఎర్రజెండా కార్యకర్తలు ఒక్కసారిగా మండిపడ్డారు. పోలీసుల వైఖరిని తప్పుబడుతూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కూనంనేనిని తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని కదలకుండా చుట్టుముట్టి, అడ్డంగా బైఠాయించారు. దీంతో అదాలత్ సెంటర్ ప్రాంతంలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు, పోలీసులకు-ప్రదర్శనకారులకు మధ్య నెట్టులాట జరిగి వాతావరణం మరింత వేడెక్కింది.

* నిరుపేదల పక్షాన పోరాటం ఆగదు..
ఈ సందర్భంగా వామపక్ష అగ్రనాయకులు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ నిరుపేదల పొట్టకొట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువ నీడ లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు లేదా ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాల్సింది పోయి, ఉన్న గుడిసెలను పీకేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. నిర్బంధాలు, పోలీసు అరెస్టులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. గతంలో జరిగిన విద్యుత్ ఉద్యమ తరహాలోనే, పేదలకు న్యాయం జరిగేంత వరకు ఇళ్ల స్థలాల కోసం రాజీలేని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
