RTC Bus Driver
* ‘తొక్కించి చంపుతా’ అంటూ బెదిరింపు
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ జిల్లా : నెల్లికుదురు మండల కేంద్రంలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ 10వ తరగతి విద్యార్థిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థిని అసభ్యకర పదజాలంతో దూషించడమే కాకుండా దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నెల్లికుదురు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న రావిరాల గ్రామానికి చెందిన భార్గవ్ అనే విద్యార్థిపై తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. TS 26 T 1266 నంబర్ గల బస్సు వద్ద జరిగిన ఘటనలో విద్యార్థిని తీవ్రంగా దూషిస్తూ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
విద్యార్థిపై ఆగ్రహంతో “బస్సు టైర్ల కింద తొక్కించి చంపుతా” అంటూ డ్రైవర్ బెదిరించినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అసభ్యకర పదజాలంతో దూషించి దాడి చేసినట్లు పేర్కొంటున్నారు. ఇదే డ్రైవర్ గతంలోనూ పలువురు విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించి, వారిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పట్ల ఆర్టీసీ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై అధికారులు దృష్టి సారించి, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
