TamilNadu CM Vijay Launches New Buses
* కొత్త బస్సులను ప్రారంభించిన తమిళనాడు ముఖ్యమంత్రి
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. విజయ్ రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగా గురువారం నాడు తమిళనాడు ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన 300 అత్యాధునిక డీజిల్, సీఎన్జీ (CNG) బస్సులను చెన్నై సచివాలయం (సెక్రటేరియట్) వేదికగా ఆయన జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.
* రవాణా సంస్థల ఆధునీకరణే లక్ష్యం…
రాష్ట్ర రవాణా సంస్థలను (TNSTC) ఆధునీకరించడం, సామాన్య ప్రజలకు ప్రయాణ సౌకర్యాలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. పర్యావరణ హితమైన సీఎన్జీ బస్సులతో పాటు ఇంధన సామర్థ్యం కలిగిన డీజిల్ బస్సులు ఇందులో ఉన్నాయి.
* విభాగాల వారీగా కేటాయింపులు….
ఈ సరికొత్త 300 బస్సులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు కేటాయించారు. అయితే, సుదూర ప్రాంతాలకు సర్వీసులు అందించే ‘స్టేట్ ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్’ (SETC) మినహా.. మిగిలిన ఏడు ప్రభుత్వ రవాణా విభాగాలకు (వివిధ జిల్లాల పరిధిలోని రీజియన్లకు) ఈ వాహనాలను పంపిణీ చేశారు. త్వరలోనే మరిన్ని కొత్త బస్సులను కూడా ప్రవేశపెడతామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.
* బస్సులో సీఎం విజయ్.. స్వయంగా వీడియో రికార్డింగ్..
బస్సులను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ కేవలం ప్రోటోకాల్కే పరిమితం కాకుండా.. స్వయంగా ఒక కొత్త బస్సులోకి ఎక్కి ప్రయాణించారు. బస్సులోని సీటింగ్ సౌకర్యాలు, ప్రయాణికులకు కల్పించిన వసతులను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో సీఎం విజయ్ తన మొబైల్ ఫోన్ తీసి, బస్సు ప్రయాణాన్ని స్వయంగా వీడియో రికార్డ్ చేయడం అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యపరిచింది.
ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా సాధారణ ప్రయాణికుడిలా బస్సులో కూర్చుని ఆయన తీసుకున్న ఈ సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సీఎం నయా లుక్ మరియు సింప్లిసిటీపై అభిమానులు, ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
