DGP CV ANAND WARANGAL
* అమరవీరుల కుటుంబాల కోసం ‘టీజీవీర్’ యాప్ ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
అకేరు న్యూస్, వరంగల్: నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ గుర్తు చేసుకున్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొందని అన్నారు.
* వరంగల్ కమిషనరేట్ పరిధిలో పర్యటించిన డీజీపీ సీవీ ఆనంద్..
విధి నిర్వహణలో నక్సలిజంతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన 28 మంది పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
అమరవీరుల కుటుంబాల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ‘టీజీ వీర్’ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ పోర్టల్‌ను డీజీపీ ప్రారంభించారు. ఆర్థిక సాయం, ఎక్స్‌గ్రేషియా, కారుణ్య నియామకాలు, ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ లేదా టైటిల్ సమస్యలు, పెన్షన్, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలను ఈ పోర్టల్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
అమరవీరుల కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు, వారి సర్వీస్ ప్రొఫైల్, కుటుంబ వివరాలు, ఇప్పటివరకు అందిన ప్రయోజనాలతో పాటు సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను కూడా ఒకే చోట అందుబాటులో ఉంచేలా ఈ పోర్టల్‌ను రూపొందించారు. నమోదు చేసిన ఫిర్యాదుల పరిష్కారాన్ని యూనిట్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నతాధికారులు పర్యవేక్షించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డులను డీజీపీ అందజేశారు. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే నేరుగా ‘టీజీ వీర్’ గ్రీవెన్స్ పోర్టల్‌కు వెళ్లేలా రూపొందించారు.
అమరవీరుల కుటుంబాల నుంచి వచ్చిన పలు దీర్ఘకాలిక సమస్యలను డీజీపీ స్వయంగా నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా ఎక్స్‌గ్రేషియా, ఆర్థిక సహాయం, ప్లాట్ల కేటాయింపు, భూముల రిజిస్ట్రేషన్, టైటిల్ సమస్యలు, పెన్షన్, ఇతర సంక్షేమ అంశాలపై కుటుంబ సభ్యులు డీజీపీ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని డీజీపీ హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతను ఆదేశించారు. అమరవీరుల కుటుంబాల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, వాటి పరిష్కారాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని సూచించారు.
ఇక వరంగల్‌తో తనకున్న అనుబంధాన్ని కూడా డీజీపీ సీవీ ఆనంద్ గుర్తు చేసుకున్నారు. నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో తన పోలీస్ కెరీర్‌ను వరంగల్‌లోనే ప్రారంభించానని చెప్పారు.
ఆ సమయంలో పోలీసులు ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను గుర్తు చేసుకున్న ఆయన… నక్సల్స్ దాడులు, ఎదురుకాల్పులు వంటి పరిస్థితుల్లో విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బంది త్యాగాలను ప్రస్తావించారు.
పోలీసు అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించిన శాంతి కారణంగానే నేడు ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొందని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. విధిని, ప్రజల రక్షణను తమ ప్రాణాలకంటే మిన్నగా భావించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని అన్నారు.
* కొత్త కమిషనరేట్ భవనాన్ని పరిశీలించిన డీజీపీ
అనంతరం డీజీపీ సీవీ ఆనంద్ నిర్మాణంలో ఉన్న వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కొనసాగుతున్న పనులపై వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత డీజీపీకి వివరాలు అందించారు.
కొత్త కమిషనరేట్ భవనం కేవలం కార్యాలయంగా కాకుండా… ప్రజలకు మెరుగైన సేవలు అందించే కేంద్రంగా ఉండాలని డీజీపీ సూచించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన అనుభవం కలిగేలా వసతులు ఉండాలని, పోలీస్ శాఖలో అంతర్గత పనితీరును మరింత సమర్థవంతంగా మార్చే విధంగా భవన నిర్మాణం, సౌకర్యాలు ఉండాలని సూచించారు.
అదే సమయంలో భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించుకునే అవకాశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని, మెరుగైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకునే విధంగా మౌలిక వసతులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
కమిషనరేట్ పరిధిలో నిరుపయోగంగా ఉన్న, శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను తొలగించాలని సూచించిన డీజీపీ… కొత్త కార్యాలయానికి వెళ్లే అంతర్గత రహదారులను కూడా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
మొత్తంగా… ఒకవైపు పోలీస్ అమరవీరుల కుటుంబాల సమస్యల పరిష్కారానికి ‘టీజీ వీర్’ను అందుబాటులోకి తీసుకురావడం… మరోవైపు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వరంగల్ కమిషనరేట్‌ను ఆధునీకరించడంపై డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక దృష్టి సారించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
