HCU Drug Test Students
* 17 మంది విద్యార్థులకు పాజిటివ్
* ఈగల్ టీమ్ దాడుల్లో వెలుగులోకి..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులు డ్రగ్స్ తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు 17 మందికి డ్రగ్ పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిష్టాత్మక వర్సిటీలో మత్తు పదార్థాల వినియోగంపై సీరియస్‌గా దృష్టి సారించాలనే డిమాండ్లు లేవనెత్తుతున్నాయి. క్యాంపస్ లోకి గంజాయి, ఇతర నిషేధిత డ్రగ్స్ విక్రయాలు, వినియోగంపై దర్యాప్తు ప్రారంభమైంది.
* ఆకస్మిక దాడులు
హెచ్ సీయూలో డ్రగ్స్ వినియోగంపై సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు, ఈగల్ బృందాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. యూనివర్సిటీలోని హాస్టల్ గదులు, క్యాంపస్‌లోని నిర్మానుష్య ప్రదేశాల్లో గాలించాయి. తనిఖీల సమయంలో విద్యార్థుల నుంచి భారీగా గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలు, రోలింగ్ పేపర్లు, స్మోకింగ్ పైపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ రాకెట్‌కు సంబంధించి అస్సాం నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న హెచ్‌సీయూ పూర్వ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి10 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
* 17 మందికి పాజిటివ్
సైబరాబాద్ పోలీసులు, ఈగల్ బృందాలు వర్సిటీలోని అనుమానిత విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాయి. పరీక్షల్లో 17 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. క్యాంపస్ లోకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి. ఎన్ని రోజులు నుంచి ఈ దందా కొనసాగుతోంది అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్ నెట్వర్క్ వెనుక ఉన్న ప్రధాన సరఫరాదారులను పట్టుకునేందుకు పట్టుబడిన విద్యార్థుల ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఇలాంటి ఘటన వెలుగుచూడటం పట్ల తోటి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
